Etela Rajender Clarity On BJP CM Candidate: తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న కథనాల్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ క్రమశిక్షణకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పిన ఆయన.. నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారన్నారు. పదవులు ఎవరూ నిర్ణయించుకోలేరని, ఆ నిర్ణయం పార్టీనే తీసుకుంటుందన్నారు. తమ పార్టీలో ఉన్న వాళ్లంతా పార్టీకి అనుగుణంగా పని చేస్తారని వివరించారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి.. పార్టీనే సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
పత్రికలు, ఎలక్ట్రానిక్ & సోషల్ మీడియాలో తానే సీఎం అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఈటెల రాజేందర్ మరోసారి స్పష్టతనిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనని అంతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ గడ్డ మీద కాషాయ జెండానను ఎగరేయడం కోసం.. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా, శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని అన్నారు. కాగా.. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించిన నేపథ్యంలో.. తెలంగాణలో అధికారంపై బీజేపీ కన్నేసింది. ఆ దిశగా తీవ్ర కసరత్తులు చేయడాన్ని మనం గమనించవచ్చు. పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో బీజేపీ దూసుకెళ్తోంది.