వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలోని విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రక్రియకు వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని కేసీఆర్ తెలిపారు. తాము ఈరోజు ఈ హోదాలో ఉండటానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్య కారణమన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.