విద్యార్థులకు షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటిపోయింది.. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించిపోయింది.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. టీఎస్ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఇంజినీరింగ్ ఫీజులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలోని 36 ఇంజినీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు లక్ష రూపాయలు దాటితే.. సీబీఐటీలో రూ.1.73లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళా కాలేజీల్లో అయితే రూ.1.55లక్షలకు చేరింది… ఇక, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోజి రూ.1.50 లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలకు చేరిందంటే.. ఫీజు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..
Read Also:
ముఖ్యంగా పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది.. కానీ, బీసీ, ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం తేల్చలేదు రాష్ట్ర ప్రభుత్వం.. రేపు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రారంభం కానుంది.. ఈనెల 13వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంది.. అంటే..సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్ లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం ఆశగా ఎదురు చూస్తున్నారు విద్యార్థులు.. ఇక, ఎస్సీ, ఎస్టీలు, గురుకులాల్లో చదివిన వారితో పాటు పదివేల ర్యాంకు వరకు విద్యార్థులందరికీ పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు.. 10 వేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం రూ.35వేలు మాత్రమే రీఎంబర్స్ మెంట్‌గా ఇస్తుండగా.. మిగతా ఫీజు విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఫీజులు పెరగడంతో.. రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు చాలా తక్కువగా ఉండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.