Duddilla Sridhar Babu: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారరు. మనం ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్‌లో ఉన్నామని, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ, ఈ భూమిపై పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని అసమర్థ నాగరికతలో ఉన్నామనేది చేదు నిజం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపి, రాబోయే తరాలకు ఒక ‘క్లీన్ ఎన్విరాన్ మెంట్’ను అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హిల్ట్’ (HILT) పాలసీకి శ్రీకారం చుట్టిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
చాలా మంది హిల్ట్ పాలసీని కేవలం పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చే ఒక సాదాసీదా ‘ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్’ ప్రక్రియగా చూస్తున్నారు. కానీ ఇది కేవలం రెవెన్యూ రికార్డుల్లో మార్పు కాదు. “పరిశ్రమలను ఓఆర్ఆర్ (ORR) అవతలికి తరలించి, మన పిల్లలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు విషరహితమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పం. ఇది రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది” అని మంత్రి వివరించారు.
1970వ దశకంలో IDPL రాకతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో బాలానగర్, సనత్ నగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు నగరం వెలుపల ఉండేవి. కానీ నేడు..ఈ ప్రాంతాలు నగరం నడిబొడ్డున (Central Business Districts) చేరాయి. ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్‌మెంట్లు వెలిశాయి. పరిశ్రమల చిమ్నీల నుండి వచ్చే విషపూరిత పొగ నేరుగా బెడ్‌రూమ్‌ల్లోకి ప్రవేశిస్తోంది. నివాస గృహాలకు, పరిశ్రమలకు మధ్య ఉండాల్సిన ‘బఫర్ జోన్’ మాయమైపోయింది.
మనం మన పిల్లల కోసం కోట్ల ఆస్తులు కూడబెట్టవచ్చు కానీ, వారు పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యం అయితే ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఇది “బిడ్డలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగమన్నట్టు” ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదని, మనం ఈ భూమికి యజమానులం కాదని, కేవలం ధర్మకర్తలం (Trustees) మాత్రమేనని గుర్తుచేశారు.
చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే అడుగుతో మొదలవుతాయని, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆ మొదటి అడుగు తెలంగాణ నుండే ఎందుకు పడకూడదని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా, నేల మనుగడ కోసం, పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చారిత్రక బాధ్యతను ప్రభుత్వం భుజానెత్తుకుందని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడం ద్వారా హైదరాబాద్‌ను కేవలం కాంక్రీట్ వనంగా కాకుండా, ఒక నివాసయోగ్యమైన మహా నగరంగా మార్చడమే ‘హిల్ట్’ పాలసీ అంతిమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.