మహబూబ్‌నగర్‌లో భూసేకరణ పేరిట వందల ఎకరాలను లాక్కుంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టును తప్పుదోవ పట్టించేలా.. భూములు తీసుకోవడం లేదని చెప్పి.. ఇప్పుడు మహబూబ్‌నగర్ హన్వాడలో రాత్రికి రాత్రి జేసీబీలు పంపి కంచెలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బడాబాబుల కోసం పేదల భూములు లాక్కుంటున్నారు. మహబూబ్ నగర్ లో మంత్రి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలు బతుకొద్దా.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కొవడానికి అధికారం ఎవరిచ్చారు. అధికారులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బానిసలుగా మారారు. సీఎస్ సోమేశ్ కుమార్ కు మెదడు ఉందా..? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్ . కోర్టుకు ఒకలా చెప్పి.. ప్రవర్తించే తీరు మరోలా ఉందని, ఇష్టమున్నట్లు వ్యవహరించొద్దని ఆయన హితవు పలికారు. భూములు తప్పనిసరి అయితే.. 2013 చట్టం ప్రకారం భూపరిహారం చెల్లించాలని, పేదలకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.