బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
దేశంలో ప్రజలందరికి ఉచితంగా పేదలకు కేంద్రం వ్యాక్సిన్ ఇచ్చిందని డీకే అరుణ అన్నారు. మోదీ పాలనలో శత్రుదేశాలు సైతం భారత్ వైపు చూడటానికి జంకుతున్నాయని అన్నారు. గతంలో సొంత జాగాలున్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గించి మోసం చేస్తున్నాడని కేసీఆర్ను విమర్శించారు డీకే అరుణ.
ఇదిలా ఉంటే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా టీఆర్ఎస్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నియోజకవర్గ సీపీఎం పార్టీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదని.. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ఉపయోగం ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు రేపుతోందని.. మతాల పట్ల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తో కలిసి పని చేసే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ తో పోరాడే పార్టీ మాది అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలు అన్నిటినీ ఐక్యం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తమ్మినేని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును ఖండించారు.