సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్‌లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్ అండ్ రన్ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 32 శాతం డ్రంకన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగాయని తెలిపారు.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి సొమ్ము
ఈ ఏడాది మొత్తం 3,989 రోడ్డుప్రమాదాలు జరగ్గా… వీటి వల్ల 759 మంది మృతి చెందారన్నారు. మరోవైపు ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై 61.4లక్షల కేసులు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 36,512 డ్రoకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 3,825 మందికి జైలు శిక్ష పడిందన్నారు. తాగి వాహనం నడిపిన 1,356 మంది లైసెన్స్ రద్దు చేశామన్నారు. క్రైం విషయానికి వస్తే ఈ ఏడాది 30,954 కేసులు నమోదయ్యాయని.. నేరస్థులు కొల్లగొట్టిన సొత్తు విలువ రూ.22.32 కోట్లు ఉంటుందన్నారు. ఇందులో రూ.11.74 కోట్లు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది పోలీసులు 53 శాతం రికవరీ చేశారని తెలిపారు.
ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరిగాయని.. గత ఏడాది 1212 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3,854 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 310 చిన్నారులను కాపాడామని పేర్కొన్నారు. 22 బాల్య వివాహాలను షీ టీమ్స్ ఆపాయన్నారు. మహిళలపై నేరాల విషయానికి వస్తే… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయన్నారు. గత ఏడాది 2,572 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,621 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 356 రేప్ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై 1.139 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.