పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న కొన్న ఘటనలపై స్పందించిన జగ్గారెడ్డి… పార్టీ బాగు కోసమే నేను మాట్లాడుతున్న.. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదన్నారు.. అందరినీ కలుపుకుని పోవాలని సూచించిన ఆయన.. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను మాట్లాడేది తప్పు అయితే.. రేవంత్‌రెడ్డి చేసేది కూడా తప్పే అంటున్నారు జగ్గారెడ్డి. ప్రతీ సభలో ఎవ్వరినీ ఆయన అభిమానులు మాట్లాడనివ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, జహీరాబాద్ వస్తె.. నాకు చెప్పావా..? అంటూ రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.. నా వెనుక సీనియర్లు ఎవరూ లేరన్న ఆయన.. సీనియర్లు ఎవరు మాట్లాడటానికి ముందుకు రారన్నారు.. ఇక, రేపటి నుండి అసలు మాట్లాడబోనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నేను చెప్పినవి మార్చుకుంటే పార్టీకి మంచిది.. లేకుంటే నష్టం అన్నారు.. రేవంత్ రెడ్డి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా..? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి… రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీనా..? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. జహీరాబాద్‌లో కార్యక్రమాలపై గీతా రెడ్డికి సమాచారం ఇవ్వరా?.. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్‌నైన నాకే సమాచారం ఇవ్వరా? అంటూ నిలదీశాడు. రేవంత్ పార్టీ ప్రోటోకాల్ పాటించం లేదని, తనతో విభేదాలు ఉన్నట్లు రేవంత్ బహిరంగంగా చెప్పాలని అనుకుంటున్నాడా? అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.