ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు.
ధరణి పోర్టల్ ఏర్పాటులో పెద్ద కుట్ర దాగివుందని ఆయన ఆరోపించారు. మ్యానివల్ రికార్డ్ లు తీసేశారు.. కబ్జాదారు కాలం తొలగించారు, మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 194,195 లలో 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఆ అసైన్డ్ భూమిలో ఎంతో మంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, ధరణితో ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు అని ఆయన వెల్లడించారు.