తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… ఆరింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. అయితే మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి. దీంతో జగ్గారెడ్డి ఛాలెంజ్ చేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీకి 8 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి 762 ఓట్లు పొంది విజయం సాధించారు.
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
మరోవైపు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్‌కు 584 ఓట్లు, ఎల్.రమణకు 479 ఓట్లు రాగా… ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రవీందర్‌సింగ్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 30 చెల్లని ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.