CM Revanth Reddy: భువనగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆంధ్రా వాళ్లను బెదిరించి లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే అని కొనియాడారు. 2009లో ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి, పార్లమెంట్ స్తంభింపచేసి, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాధించారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నిబద్ధత గల కాంగ్రెస్ సైనికులని సీఎం అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా డ్రామాలో ఉపఎన్నికలు తీసుకువచ్చి, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రవాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. దొరవారి గడిలో సారాపోసిన వ్యక్తి జగదీష్ రెడ్డి అని విమర్శించారు. నాతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే అని రేవంత్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు కుడి, ఎడమ భుజాలని అన్నారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి డబుల్ ఇంజన్లు అని అభివర్ణించారు. పార్టీ నిర్ణయంతో తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, ఈ పదవిని బాధ్యతగా చూశానని, అహంకారంతో వ్యహరించలేదని అన్నారు. పేదవాడి సంక్షేమం కోసం, తెలంగాణను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పనిచేస్తున్నానని చెప్పారు.
Read Also: Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
ముఖ్యమంత్రి కాకముందు తను కార్యకర్తలు ఎలా కలిశారో, సీఎం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కలుస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను, నేతలను కేసీఆర్ ఏనాడు గౌరవించలేదని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, రాహుల్ ప్రధాని కావాలని అన్నారు. కాంగ్రెస్‌ని ఎందుకు ఓడించాలో సీఎం కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమంలో దూసుకుపోతుంటే, కేసీఆర్ మాత్రం ప్రభుత్వం కూలుతుందని శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు.
నరేంద్రమోడీ దెబ్బకు ప్రజస్వామ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని, ఈడీ, ఐటీ, సీబీఐని వాడుకుని దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మోడీకి కేసీఆర్ అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీని బొందపెట్టాలని ప్రజలను కోరారు. మా జోలికి వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ బొందపెడతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ తప్పుపట్టారని, బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదని అన్నారు.