హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల (1995-2025) నిరంతర శ్రమ ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సుజెన్ మెడికేర్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్ (Cure), ప్యూర్ (Pure), రేర్ (Rare) అనే మూడు విభాగాలుగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు సీఎం తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే తెలంగాణ పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం వాటా తెలంగాణదేనని, ఫార్మా రంగంలో ప్రపంచమే మన వైపు చూసేలా ఎదుగుతున్నామని గర్వంగా చెప్పారు.
రాజకీయ వివాదాల కంటే సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను” అని వ్యాఖ్యానిస్తూ, కృష్ణా నది జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దని, అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రాక రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలన్నా, నీటి సమస్యలు తీరాలన్నా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల సహకారం అవసరమని, అందుకే తాము వివాదాల కంటే సామరస్యపూర్వక చర్చలకే మొగ్గు చూపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల , రైతుల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌లోని ‘ఫ్యూచర్ సిటీ’లో నివసిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చడమే తమ సంకల్పమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!