నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమలకై సేకరించే భూములు, బంజరు భూములే ఉండడంతో పాటు సాగుకు యోగ్యంకాని కానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల, రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతోపాటు కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించాలన్నారు. ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను నిర్దేశించారు. అలాగే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.
ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతో పాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని తెలియజేసారు. పరిశ్రమలకు ధర్మల్ విధ్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సి.ఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ కాసీం తదితరులు హాజరయ్యారు.