CM Revanth Reddy : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు.
ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన సీఎం, వరదనీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై వివరాలు కోరారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మునిగిన రహదారులు, ఇళ్లలోకి ప్రవేశించిన వరదనీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
ఈ పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు.