హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజలు చేశారు. నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, కాలేరు వెంకటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రిని 17 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు. అలాగే కొత్తపేట టిమ్స్ ఆసుపత్రిలో 21.36 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా అల్వాల్ టిమ్స్.. 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.