CM KCR: ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పెట్టిన భిక్ష అని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాకలోనే తాను చదువుకున్నట్లు చెప్పారు. ఉన్న తెలంగాణను ఊగగొట్టంది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. 2001లో గులాబీ జెండా ఎగిరితే, 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుందని చెప్పారు.
2004లో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో దెబ్బతిన్నాం, మళ్లీ అలా జరగకూడదని ఓటర్లను కోరారు. రైతు బంధును పుట్టించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంట్ వద్దు, మూడే గంటలు చాలు అని అంటున్నాడని, రాహుల్ గాంధీకి ఎద్దు, వ్యవసాయం గురించి తెలుసో లేదో అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: LTTE Prabhakaran: తమిళటైగర్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడు.. తమిళ నేత సంచలన వ్యాఖ్యలు..
ధరణి తీసేసి కాంగ్రెస్ భూమాత పెడతామంటుందని, అది భూమానా..? భూమేతనా? అని ప్రశ్నించారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని అడిగారు. ధరణి తీసేస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందని అన్నారు. ప్రభాకర్ రెడ్డి దోమకు కూడా అన్యాయం చేయడని, దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.
దుబ్బాక ఉపఎన్నికల సమయంలో నేను రాలేదని, అప్పుడు వస్తే కథ ఒడిసిపోయేదని, నోటికివచ్చినట్లు ఇక్కడ ఎమ్మెల్యే వాగ్ధానాలు చేశాడని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, నేను కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశానని, 157 మెడికల్ కాలేజీల్లో కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నవోదయ కూడా ఒక్కటి ఇవ్వలేరని చెప్పారు. ఏమీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి..? బీజేపీవి జూటా మాటలని, దుర్మార్గుల చేతికి తెలంగాణ ఇచ్చి ఆగం కావడన్ని ప్రజల్ని కోరారు. నేను దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాని కోరానని, ఆయన గెలిస్తే నెల రోజుల్లో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు.