టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో అంగరంగగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ జెండావిష్కరణను సీఎం కేసీఆర్ గావించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంన్నాయన్నారు. ఏడుపొచ్చి ఏడుద్దామన్నా.. ఎవ్వరినీ పట్టుకొని ఏడువాలో తెలియని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు నుంచి ఉద్భవించిన పార్టీయే టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు 60 లక్షల సభ్యత్వాలతో, వెయ్యికోట్ల ఆస్తులతో ఉందన్నారు.
అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి, రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చుదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన కొనియాడారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కంచుకోటని, ఈ టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఈ 2 దశాబ్దాలలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, విజయాలు, అపజయాలు ఎదుర్కొందని ఆయన అన్నారు.