కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మరోసారి చర్చ సాగుతోంది.. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయన.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇక, బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. కోమటిరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో సమావేశమైన భట్టి… మూడున్నర గంటలకు పైగా ఆయనతో చర్చలు జరుపుతున్నారు.. బీజేపీలోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నారు..
Read Also: CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
కాంగ్రెస్‌ను వీడనున్నట్టు సంకేతాలు ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నేపథ్యంలో.. భట్టి విక్రమార్క.. ఆయన నివాసానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రాజగోపాల్‌పై అధిష్టానికి ఫిర్యాదు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.. కాగా, ఎన్నికల్లో గెలిచేందుకు నీచాతినీచమైన విధానాలను సీఎం కేసీఆర్ అనుసరిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే సీఎం కేసీఆర్ అన్ని రకాల హామీలు వస్తాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని తాను కోరుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామాగా కొట్టిపారేశారు. మునుగోడు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే, వారు చెప్తే తాను రాజీనామా చేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.. వారికి ఏది మేలు జరుగుతుందో ఆ పని కోసం తన సీటును కూడా త్యాగం చేస్తానని.. కానీ, కేసీఆర్ ప్లాన్ ప్రకారం ట్రాప్‌లో పడదల్చుకోలేదన్నారు. తనను మునుగోడు ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారని.. హుజూరాబాద్ తరహాలో ప్రలోభాలు పెట్టినట్లుగా ఇక్కడ కుదరదన్నారు.. తాను డబ్బు కోసం రంగులు, పదవుల కోసం పార్టీలు మారే రకం కాదని కూడా స్పష్టం చేశారు.. మరి, కోమటిరెడ్డి అడుగులు ఎటువైపో.. కాలమే సమాధానం చెప్పాలి.