ఖమ్మం జిల్లా నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారిని నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భావజాలాన్ని నమ్మి, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం పని చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సమిష్టి కృషి వల్ల ఈ జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 నుంచి 2022 వరకు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ కాంగ్రెస్ కోటను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ లోకి రావడానికి ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ కంచుకోటను బలంగా ఉంచిన వారిని ఎవరికోసం ఫణంగా పెట్టమని, పార్టీని నిలబెట్టిన నాయకుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఆయన వెల్లడించారు. కొత్తగా వచ్చిన వారిని పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన పాతవారిని పార్టీ వదిలేస్తామని అనుకోవద్దని, కొత్తగా చేర్చుకునే వారికి ఎవరికి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీలు ఎవరు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.