ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. రెండున్నర కోట్లు తీసుకొని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారని స్రవంతి ఆరోపించారు.
Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం
ప్రతి నెల రూ.5 లక్షల ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కిషన్ రెడ్డి చెప్పినట్లు వినలేదని అప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్‌తో బెదిరించి తనకు షోకాజ్ నోటీసులు ఇప్పించారని స్రవంతి తన ఫిర్యాదులో తెలిపారు. అప్పర్ క్యాస్ట్‌తో గొడవపడలేరని, లీవ్‌లో వెళ్ళాలని కలెక్టర్ అమాయ్ కుమార్ 2022 జూలై 7న బెదిరించారని స్రవంతి ఆరోపించారు.