Kachiguda Railway Track : హైదరాబాద్ నగరంలో గురువారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. కాచిగూడ రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి ఓ కారు నిలిపివేయడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రైల్వే మార్గంలో కారు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే కాచిగూడ పోలీసులు, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై నిలిచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను పిలిపించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు గంట పాటు రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కఠిన భద్రతా చర్యలు అమలు చేశారు.
పోలీసుల దర్యాప్తులో ఆ కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు తేలింది. అయితే బాలాజీ బుధవారం తన కారును రెంట్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపి, కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి, నియంత్రణ కోల్పోయి కారును రైల్వే ట్రాక్ సమీపంలో నిలిపి వెళ్లిపోయినట్లు తేలింది.
తర్వాత పోలీసులు కారు యజమానిని పిలిపించి, వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక రైల్వే పోలీసులు రాత్రి పహారాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
Off The Record: పవన్ తీరు మారుతున్న సంకేతాలు.. పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి?