Site icon NTV Telugu

Sabitha Indra Reddy: ఆ వార్తలు అవాస్తవం.. కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తా..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. మరికొంత మంది కీలక గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..

తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏ మాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలోనే, కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తానని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. సొంత గూటికి చేరుకునేందుకు.. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారునితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

Exit mobile version