KCR Birthday Celebrations:బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా.. ఈ నెల 17న ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించారు. కాగా.. 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలు, వికలాంగులకు వీల్‌ఛైర్స్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Read also: Income Tax : పొరపాటున కూడా ఈ 5 లావాదేవీలు చేయకండి.. చేశారో ఐటీ నోటీసులు తప్పవు
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ, ఆటో డ్రైవర్లకు బీమా పత్రాల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ ఎదుగుదల, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 70వ పుట్టినరోజు సందర్భంగా 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు వెల్లడించారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించాలని తలసాని పిలుపునిచ్చారు.
Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!