తెలంగాణలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ పర్యటన ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు బీజేపీ నేతలు. తన పర్యటనలో ఆయన అనేక అంశాలను పరిశీలించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించనున్నారు.
పార్టీ సంస్థాగత అంశాలు, నేతల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు సంతోష్. బీజేపీ బలోపేతం పై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం తమ దూతగా సంతోష్ ని హైదరాబాద్ కి పంపించింది. రాష్ట్ర పార్టీని మరింత చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయడం, పార్టీలో చేరికల పై పార్టీ హై కమాండ్ దృష్టి పెట్టింది. నేతల మధ్య సమన్వయలోపం లేకుండా టీం వర్క్ తో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నారు సంతోష్. అంతేకాకుండా, ఆర్ఎస్ఎస్ పెద్దలతోను సమావేశం కానున్నారు బిఎల్ సంతోష్. ఇంతకుముందే రాష్ట్రంలో పర్యటించి వెళ్ళారు బీజేపీ నేత శివ ప్రకాష్. సంతోష్ పర్యటన అనంతరం బీజేపీ హైకమాండ్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.