వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డ కాషాయ అడ్డా అని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేస్తామని తెలిపారు. యూపీలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణం తరహాలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నిర్మాణంతో పాతబస్తీలోని టూత్ పాలిష్ ఐకాన్‌లన్నీ కొట్టుకుపోతాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని వ్యాఖ్యానించారు. పాతబస్తీ హిందూవులకు అడ్డా అని.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు యూనిఫారంతో మాత్రమే పాఠశాలకు రావాలనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎంఐఎం ఆగడాలపై ముస్లిం సమాజం ఆలోచించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు ఏ మాత్రం భయపడరని బండి సంజయ్ స్పష్టం చేశారు.