తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతుండగా టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ శ్రేణులు మద్యం సేవించి యాత్రను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా.. పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
బండి సంజయ్ కి సెక్యూరిటీ పెంచాలని గతంలోనే విజ్ఞప్తి చేశాం… భద్రత ను పెంచలేదని ఆయన మండిపడ్డారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కి సిద్ధాంతాలు లేవు, క్రమశిక్షణ లేదు… గౌరవించాలని లేదని ఆయన విమర్శించారు. ఏ పద్దతిలో బుద్ధి చెప్పాలో బీజేపీ కి తెలుసునని ఆయన మండిపడ్డారు. బాల్క సుమన్ వాడే భాషను మనుషులు ఎవరు వాడరని, లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే నువ్వు నాన్ లోకల్.. టీఆర్‌ఎస్ పార్టీ అధినేతే బొబ్బిలి ప్రాంతం నుండి వచ్చానని చెప్పుకున్నారన్నారు. సింగరేణి గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన ధ్వజమెత్తారు.