BJP Distorting History Says Mallu Bhatti Vikramarka: దేశ స్వాతంత్రంలో పాల్గొన్న చరిత్ర బీజేపీకి లేదని, ఆ పార్టీ చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కొనసాగుతోన్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర గానీ, జైలుకు వెళ్లిన నాయకులు గానీ బీజేపీకి లేరని అన్నారు. మహాత్మా గాంధీపై కూడా ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, జాతిపిత స్థాయిని తగ్గించే విధంగా కుట్రలు పన్నుతోందని, ఇది నిజంగా దారుణమని అన్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం కూడా బీజేపీ కుట్రలు పన్నుతోందని, వాటిని తాము సాగనీయమని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో తాను చర్చిస్తున్నానని, ఎవరూ అధైర్య పడొద్దని, ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్‌దేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి తమ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ సీనియర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నానని, వారందరినీ సమన్వయ పరిచేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరుపుతున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చర్చలు జరిపానని, ఇంకా అందరితోనూ మాట్లాడుతానన్నారు. మునుగోడు కాంగ్రెస్‌దేనని నమ్మకం వెలిబుచ్చిన ఆయన.. ఎవరో ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన, పార్టీకి వచ్చే నష్టం వాటిల్లదని చెప్పారు.