రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అపహరణకు గురైన మేకలు దొంగలను పట్టించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇదే నిజం.. మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు పెట్టిన మేకలు.. దొంగలను పట్టించాయి. ఈ ఘటన హైదరాబాద్, పాతబస్తీలోని జియా గూడ మార్కెట్లో జరిగింది. పెద్ది ఎల్కిచర్లలో వెంకటయ్యకు చెందిన 30 మేకలను ఈ నెల 9న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వెంకటయ్య, అతని కుటుంబసభ్యులు ఆ రోజు నుంచి వాటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ సెప్టెంబరు 11న జియాగూడ మేకల మార్కెట్ కు వచ్చాడు. అక్కడ ఓ కంటెయినర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్ ను చూసి అరవడం మొదలు పె ట్టాయి. దీంతో ప్రవీణ్ తమ కోడ్ భాషలో ఆ మేకలను పిలిచాడు. అంతే ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ దగ్గరికి పరుగు తీశాయి. దీంతో ఆ మంద వద్ద ఉన్న వ్యక్తులను ప్రవీణ్ ప్రశ్నించగా.. తాము మేకలను రూ.30 లక్షలకు కొన్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ప్రవీణన్ ను వారు భయపెట్టేందుకు యత్నించారు.
ప్రవీణ్ ద్వారా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వెంకటయ్య తదితరులు కుల్సుంపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ మేకలతో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాన్ని అంగీకరించారు. నిందితులను, మేకలను శుక్రవారం రాత్రికి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మరో ముగ్గురు తమ ముఠాలో ఉన్నారని ఆ దొంగలు చౌదరిగౌడ పోలీసులకు వెల్లడించారు. దీంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు దొంగలించి దాచిపెట్టిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.