దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ కూడా ఇప్పుడు చేజారిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ అంశంపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన అభిప్రాయాలు వెల్లడించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందన్నారు. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందని అభిప్రాయపడ్డారు.
అటు పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉందని.. రోగం ముదిరాక మందు వేసినట్టుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అయినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. అయితే పంజాబ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు తేడా ఉందని, పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప వివాదాలు లేవని భట్టి వివరించారు. తెలంగాణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.