రాష్ట్రంలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించుకున్న బీజేపీ.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేరుస్తుందని భావిస్తే, దానికి బదులుగా తెలంగాణపై దండయాత్ర చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అవమాన పరిచారన్నారు. అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందన్న విషయం.. ఈ సమావేశాలతో తేలిందన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహించారు.
బీజేపీతో యుద్ధమని చెప్పిన కేసీఆర్.. ఇక్కడ బీజేపీ సమావేశాలు నిర్వహించినప్పుడు మూడు రోజులపాటు ఏం చేశావని సీఎంని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణలో దండయాత్ర చేస్తుంటే, దగ్గరుండి మరీ పోలీసుల రక్షణ కల్పించారని, ఎందుకు మోదీని ప్రశ్నించలేదని కేసీఆర్‌ని అడిగారు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఆయన మాటలకు కాలం చెల్లిందని అన్నారు. బలహీన వర్గాలు, గిరిజనుల హక్కుల కోసం భారీ సభలు పెడతామని.. ఆ వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ పాలనని చూశామని.. వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెద్దామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.