Bhatti Vikramakra : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి ఏటా జనవరి , జూలై నెలల్లో నిర్వహించే సమీక్షలో భాగంగా, ఈ ఏడాది జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా ఈ పెంపును ఖరారు చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న , విశ్రాంతి తీసుకుంటున్న సుమారు 71,387 మందికి ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
సంస్థల వారీగా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తే, టీజీ ట్రాన్స్‌కోలో 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది ఆర్టిజన్లు, 2,446 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,251 మందికి ప్రయోజనం కలుగుతుంది. జెన్‌కో పరిధిలో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లు , 3,579 మంది పెన్షనర్లు ఈ పెంపు పరిధిలోకి రానున్నారు. అలాగే ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి పెద్ద సంఖ్యలో లబ్ధి పొందుతుండగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది ఆర్టిజన్లు, 6,115 మంది పెన్షనర్లు తాజా ఉత్తర్వులతో ప్రయోజనం పొందనున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, ప్రభుత్వం ఈ డీఏను ఖరారు చేయడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.