Basara Student Missing: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ)లో చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కత్తుల బన్నీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు బన్నీ ఇంటికి వెళ్తున్నానని అధికారుల నుంచి అనుమతి తీసుకుని వెళ్లిపోయాడు. 7న కాలేజీకి వస్తానని చెప్పిన బన్నీ ఇంటికి చేరుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం కొడుకుతో మాట్లాడేందుకు బన్నీ తల్లి ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. బన్నీ తల్లిదండ్రులు తమ కుమారుడి స్నేహితులను, యూనివర్సిటీ అధికారులను విచారించగా.. 6వ తేదీన బన్నీ ఇంటికి వెళ్లాడని చెప్పారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే బన్నీ పోన్ స్విచ్ఛాఫ్ అవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనంతరం బన్నీ తల్లిదండ్రులు సోమవారం హాస్టల్‌కు వచ్చి సిబ్బందిని నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ కుమారుడిని ఇంటికి ఎలా పంపిస్తారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు.
Read also; Article 370: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు
ఇదే విషయమై బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిని ప్రశ్నించగా, విద్యార్థి ప్రస్తుతం ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్నాడని, యూనివర్శిటీ ఆంక్షల మేరకు బయటకు పంపామని బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన బన్నీ తల్లిదండ్రులు ఆదివారం రాత్రి తూప్రాన్ పోలీసులను ఆశ్రయించారు. బాసర పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పంపించారు. ఈ క్రమంలో బన్నీ తండ్రి సోమవారం బాసరకు వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బన్నీ ఒంటరిగా ఆటోరిక్షాలో వెళ్లి బాసర రైల్వే స్టేషన్‌లో నాందేడ్ టికెట్ తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా బన్నీ మహారాష్ట్రలో ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించడంతో బాసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
PMAY: ఏడాది చివరి నాటికి పీఎం ఆవాస్ యోజన పూర్తి.. ఇప్పటికే 76 లక్షల ఇళ్లు పూర్తి