PMAY: వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యం చేరుకోవాలని ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే పీఎంఏవైలో కొన్ని ఇళ్లను పూర్తి చేయించిన కేంద్రం డిసెంబర్ నాటికి మిగిలిన వాటిని పూర్తి చేయనున్నారు. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాని మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. పీఎంఏవై(అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.2 లక్షల కోట్లతో 1.18 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇందులో ఇప్పటికే 76 లక్షల గృహాలు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
Read also: 2023 July Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. జులైలో ఒక శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి!
పీఎంఏవైలో మరో 42 లక్షల గృహాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో 2.50 లక్షల గృహాలకు మంజూరులివ్వగా.. అందులో 2.23 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికే కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4,475 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.3,314 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 21.32 లక్షల గృహాలకు మంజూరునివ్వగా.. వాటిల్లో 7.95 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికై కేంద్రం తన వాటాగా రూ.32,499 కోట్లకు గాను రూ.20,045 కోట్లు విడుదల చేసింది. ఇక పీఎంఏవై(గ్రామీణ్) కింద కేంద్రం మొత్తంగా 2.93 కోట్ల గృహాల నిర్మాణాలకు మంజూరు ఇవ్వగా.. వాటిలో ఇప్పటికే 2.40 కోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 53 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.