మీరు మరో ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ బాసరలోని ట్రిపుల్ ఐటి సంస్థ అని పేర్కొన్నారు. బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులు గత ఆరురోజులుగా వేల మంది విద్యార్థులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుందని తెలిపారు. జాతీయపార్టీ ఏర్పాటుపై, పొలిటికల్ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ గత 6 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం మీకు సమయం చిక్కదని మండిపడ్డారు. . గత ఆరు రోజులుగా ఎండకు ఎండి, వానకు తడుస్తూ గాంధేయపద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలపై కనీసం మీరు అధికారులతో సమీక్ష చేయడం కానీ, ఈ సమస్యసై దృష్టిపెట్టడం కానీ చేయకపోవడం అత్యంత బాధాకరం, మీ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం.
మీ కుమారుడు విదేశీ పర్యటనకు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారు గానీ, ఉన్నత విద్యకు, విద్యార్థుల న్యాయమైన కోరికల పరిష్కారం కోసం నిధుల కేటాయించడానికి మీకు నిధులుండవు. మీకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి విద్యార్థులన్నా, వారి సమస్యలన్నా చులకన భావం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. ఈ విషయాన్ని గుర్తు ఉంచుకుని ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు వెంటనే బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని సాక్ష్యాత్తు విద్యాశాఖామంత్రి ప్రకటించడం, జిల్లా అధికారులు, పోలీసులు ట్రిపుల్ ఐటి విద్యార్థులను బెదిరించడం, వారి తల్లిదండ్రులకు కూడా బెదిరింపు హెచ్చరికలు జారీచేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను బెదిరించడం మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఎటువంటి బేషజాలకు పోకుండా విద్యార్థులతో చర్చలు జరపాలని విద్యార్థుల డిమాండ్లపై సావధానంగా చర్చలు జరపకుండా విద్యార్థుల ఆందోళనలకు రాజకీయాలను ఆపాదించడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశానికి పిలవాలని, అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని, ఆందోళన చేస్తునన విద్యార్థులు, వివిధ రాజకీయపక్షాలపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రులు, అధికారులు, విద్యార్థుల బెదిరింపులకు గురిచేయవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని బిజెపి తెలంగాణ శాఖ కోరుతోందని లేఖలో పేర్కొన్నారు.
Chandrababu: తప్పుచేసినవారు తగిన మూల్యం చెల్లించుకోవాలి