తెలంగాణ పాలిటిక్స్ రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ను బీజేపీలో చేరాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆహ్వానించారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని… గతంలో ఏబీవీపీలో పనిచేసిన నాయకుడని చెప్పారు. దాసోజు శ్రవణ్ ఘర్ వాపీసీలో భాగంగా బీజేపీలో చేరాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు..
4వ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ కుమార్ భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం ముక్తాపూర్ సమీపంలోని విజయదుర్గ రైస్ మిల్లు వద్ద పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ జిట్టా బాలకృష్ణారెడ్డిలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ 4వ రోజు పాదయాత్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో తిరిగాను. మూసీ దుస్థితిని చూశాను. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాను. ముఖ్యమంత్రి కేసీఆర్ మూసీ నదిలో స్నానం చేస్తానని, బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి తీసుకొస్తానని, కొబ్బరి నీళ్లలా మారుస్తానని ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు.
అందుకే మూసీ నీళ్లను బాటిళ్లలో పట్టుకుని తీసుకొచ్చాను. ఆ నీళ్ల బాటిల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపుతున్నా… దీంతోపాటు సీఎంకు లేఖ రాస్తున్నా…ఈ ప్రాంత ప్రజలు బతకలేని దుస్థితిలో ఉన్నరు. వాళ్లెంత దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారో తెలిపేందుకు మూసీ నీళ్లను మీకు కొరియర్ చేస్తున్నా… వాటితో స్నానం చేస్తావో.. తాగుతావో.. ఇంకేం చేస్తావో మీ ఇష్టం. ఇప్పటికైనా ప్రజల బాధలను ద్రుష్టిలో ఉంచుకుని నువ్విచ్చిన హామీ మేరకు తక్షణమే మూసీ ప్రక్షాళన కోసం రూ.4 వేల కోట్లు విడుదల చేయాలి. యుద్ద ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేయాలి.
ఈరోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఈరోజు ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఈనెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలో చేరబోతున్నారు. దాసోజు శ్రవణ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి. బీజేపీలో చేరాలని ఆయనను నేను ఆహ్వానిస్తున్నా… తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ చురుగ్గా పాల్గొన్నారు. కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. చరిత్ర తెలిసిన వ్యక్తి.
దూరదృష్టవశాత్తు కేసీఆర్ కు ఆరోజు దాసోజు శ్రవణ్ చాలా మంచివాడిగా కన్పించారు. దాసోజుకు తెలంగాణపై పూర్తి అవగాహన, చరిత్ర ఉంది. ప్రజలంతా దాసోజు వాయిస్ వింటుంటే తట్టుకోలేక కేసీఆర్ దాసోజును అణగదొక్కారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న నేత. గతంలో ఏబీవీపీ తరపున అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాస్తవాలను వివరించే వారు. తెలంగాణ ఆకాంక్ష, ఉద్యమం విషయంలో నాతోపాటు అనేక మందికి సూచనలు, సలహాలిచ్చారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి… ఏబీవీపీలో పనిచేశారు…మళ్లీ బీజేపీలోకి రావాలని కోరుతున్నా…ఘర్ వాపీసీ రావాలని కోరుతున్నా అన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత వరకు మంచివాడే.. రాజీనామా చేసి బీజేపీలోకి వస్తాననగానే కాంట్రాక్టులిచ్చారనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. కేసీఆర్ కుటుంబ పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుంది. కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎన్ని కుట్రలు చేసినా… ఎన్ని డబ్బులు వెదజల్లినా జనం నమ్మరు.బీజేపీ భారీ విజయంతో మునుగోడులో గెలిచి తీరుతుంది. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక అన్నారు బండి సంజయ్.
Dasoju Sravan : ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారు