Bandi Sanjay Warns CM KCR And Says Every Answer Will Be Given: శనివారం మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆ సభలో కేసీఆర్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్తామన్నారు. అక్కడితో తాము ఆగేది లేదన్న బండి సంజయ్.. మునుగోడు సభలోలోనే కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం మునుగోడు భయం పట్టుకుందని, ఆ భయంతోనే మునుగోడు సభలో ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
కాగా.. మునుగోడులో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సాంబమూర్తి నగర్‌లోని సత్యనారాయణ అనే కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం వెళ్లిన అమిత్ షా.. అక్కడ రైతు సంఘాలతో భేటీ అయ్యారు. వారితో సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఫసల్ బీమా పథకం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రభుత్వాన్ని మారిస్తేనే, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ సభలోనే అమిత్ షా సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.