Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా, అజెండా లేదని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి అంటే అర్థమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రారంభించినప్పుడు పార్టీలో ఉన్న వాళ్లలో ప్రస్తుతం ఎంతమంది ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలతో జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కనీసం సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా జాతీయ పార్టీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో విమానం కొన్న వాళ్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారన్న బండి సంజయ్… వారిలో ఒకరు కేఏ పాల్ కాగా, మరొకరు కేసీఆర్ అని తెలిపారు. భవిష్యత్తులో విమానం కొన్న వీరిద్దరూ పొత్తు పెట్టుకుంటారేమోనని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. బుధవారం నాటి టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఏ ఒక్కరు కూడా సంతోషంగా కూర్చోలేదని ఆయన అన్నారు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. కేసీఆర్ ఏ అజెండాతో జాతీయ పార్టీ పెట్టారని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో తెరాస బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ నాటకం ఆడుతున్నారన్నారని విమర్శలు గుప్పించారు.
Sushmita Sen: హిజ్రాగా మారిన సుస్మితా సేన్.. లలిత్ మోడీ ప్రభావమా..?
తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేశారని.. కానీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి బీఆర్‌ఎస్ పేరుకు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా వచ్చే ఆదాయం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారో.. ఏం చేస్తారో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.