బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పై ఇవాళ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 24 నుండి పాదయాత్ర మొదలు పెడుతున్నానని… భాగ్యలక్ష్మి అమ్మ వారి దేవాలయం నుండి ప్రారంభం కానుందని ప్రకటించారు. పాదయాత్రను ప్రకటించిన వెంటనే మేమూ నడుస్తామంటూ స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఒక్కో జిల్లా నుండి 20 మంది మాత్రమే పాదయాత్రలో నడిచేందుకు అవకాశాన్ని కల్పించామని.. పూర్తి సమయం కేటాయించి, అనుభవం కలిగిన నాయకులను మాత్రమే పాదయాత్రలో భాగస్వాములను చేస్తున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడం… బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.