ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా? అంటూ ఫైర్ అయ్యారు. మక్కలు, వడ్లు కొనకపోతే కొనేటట్లు సీఎం కేసీఆర్ మెడలు వంచుతామన్న ఆయన.. పోడు భూముల మీద కొట్లాడితే మా మీద కేసులు పెట్టారని.. అయినా పోడు భూముల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.
మరోవైపు.. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా అసలైన ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయి కాబట్టి, నేను ప్రజా సమస్యలపై సీఎం కు ఛాలెంజ్ లు విసురుతుంటే.. ప్రజల దృష్టి మళ్లించడానికి, ఉనికిని చాటడానికి కొనఊపిరితో ఉన్న పార్టీకి నాయకుడిగా ఉన్న ఒకాయన పనికి రాని ఛాలెంజ్ విసిరితే టైంపాస్ చేయడానికి అధికార పార్టీ నాయకుడు హంగామా చేస్తున్నాడంటూ కామెంట్ చేశారు.. ఎవరెవరు ఒకటి అనేది దీనితో ప్రజలకు స్పష్టంగా అర్ధం అవుతోందంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో.. కొండా విశ్వేశ్వరరెడ్డి వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన.. బండి సంజయ్ వైట్, బ్లాక్, పింక్, గ్రీన్, ఆరంజ్.. ఏ ఛాలెంజ్ కి అయినా వెనక్కిపోడు అంటూ స్పష్టం చేశారు.