Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్.. అప్పుల మీద అప్పులు చేసిన ముఖ్యమంత్రికి ఏ ఒక్కరు అప్పించే పరిస్థితి లేదని విమర్శించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల వరకు అప్పు ఉందని చెప్పుకొచ్చారు.. మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది.. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.. మద్యం ద్వారా సంవత్సర కాలంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చింది.. అంటే, ప్రభుత్వం మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.. ఇక, సచివాలయాన్ని ఆయన సౌలభ్యం కోసం నిర్మించుకున్నారు అని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.. నీ పుట్టిన రోజునాడు సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తావు? అని ప్రశ్నించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Read Also: Varahi in Kondagattu: కొండగట్టులో వారాహి లైవ్ అప్‌డేట్స్..
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన తర్వతే ఒక్క డీఏ ఇచ్చారని తెలిపారు బండి సంజయ్.. ఇక, గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఇది ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.. గవర్నర్ కి కనీసం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు.. అలాంటి మీరు.. అసలు, జాతీయ పార్టీ ఎందుకు పెట్టారో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు. కలెక్టర్, పోలీసు వ్యవస్థలు నాశనం అయ్యాయన్న ఆయన.. 30వ తేదీలోగా 317 జీవోను సవరించకుంటే బీజేపీ అధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ప్రకటించారు.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా తీయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్తే.. ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపి గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన బండి సంజయ్.. 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్దికంగా అభివ్రుద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యాచరణను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లడం ఆనవాయితీ… కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయ, రాజకీయ తీర్మానాలతోపాటు అనేక అంశాలపై చర్చించబోతున్నాం అన్నారు బండి సంజయ్.. కేసీఆర్ కుటుంబంపైన, టీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైంది. మీ అందరి ఆశీర్వాదం, సహకారంతో 5 విడతల పాదయాత్రను పూర్తి చేసుకున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర దేశానికి స్పూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారంటే అది గొప్ప విషయం.. మనకు స్పూర్తి.. సమాజంలో మంచి సందేశం వెళ్లింది. కష్టపడి పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందనే సంకేతాలు పంపారన్నారు.. తెలంగాణలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్ర్పహల్లో, కష్టాల్లో ఉన్నరు. ఈరోజు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపట్ల ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా, ఆత్మవిశ్వాసం బీజేపీ కల్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఎదురు చూస్తున్నారు. బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందేనని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు.