Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి బీజేపీ ఖాతాలో చేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు జరగాలని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని సంజయ్ తెలిపారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధులేమీ లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది అప్పులు తీరచేయలేక ఊళ్లను వదిలి నగరాలకు వలస వెళ్ళారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీని అధికారంలోకి తెచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రజలంతా కసరత్తు చేస్తున్నారు” అని అన్నారు.
మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, తాజా మాజీ సర్పంచులు, ఉద్యోగులే ఈసారి బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్ పాలనలో ఈ వర్గాలందరికీ అన్యాయం జరిగింది. హామీలు ఇచ్చి ఒక్కటినీ అమలు చేయలేదు. మహిళలకు నెలనెలా 2500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతులకు రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా కార్డులు – అన్నీ మోసమే అయ్యాయి. ఈసారి ఈ వర్గాలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పబోతున్నారు” అని మండిపడ్డారు.
అభ్యర్థుల టిక్కెట్ల విషయంలో బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రాష్ట్ర నాయకత్వం సర్వేలు నిర్వహిస్తోందని సంజయ్ తెలిపారు. “గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తాం. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దు. పార్టీ పదవుల రూపంలో గౌరవం, సహాయం అందిస్తాం. కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.
గ్రామాల్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని సంజయ్ గుర్తుచేశారు. “ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్ఎఫ్ నిధులతో రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, బోర్లు – ఇవన్నీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే సాధ్యమయ్యాయి. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాలేదు. బీఆర్ఎస్ గెలిచినా పరిస్థితి మారదు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, సిరిసిల్ల జిల్లా నాయకుడు సురేందర్ రావు సహా పలువురు నేతలు బండి సంజయ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. “సంజయన్నా… మీరు సెస్ ఎన్నికల్లో కేటీఆర్ కు చుక్కలు చూపించారు. మాకు అండగా నిలిచి సహాయం చేశారు. మీ మేలు మేమెప్పటికీ మరవలేం. జన్మంతా రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు.