Bandi Sanjay : గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని చెప్పారు. ఇది సైన్స్ అంగీకరించిన వాస్తవాలని తెలిపారు. ఇస్లాంలోనూ కొందరు మతపెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన ద్రుశ్యాలను తాను చూశానని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని నారాయణగూడ కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో ‘‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఝానం’’పై ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత గో సేవా విభాగం ఆధ్వర్యంలో ‘‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఝానం’’పై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘‘గోసేవా తెలంగాణ’’ విభాగం వారికి ( ప్రాంత ప్రముఖ్ ఎం.వి.నివాస్, ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్) అభినందనలు. ఈరోజు(అక్టోబర్ 26న) రాష్ట్రస్థాయి పరీక్షల్లో గెలుపొందిన విజేతలకు నా అభినందనలు. కానీ అంతకంటే సంతోషం కలిగించే విషయం ఏమిటంటే…. గోమాత, వ్యవసాయం, పర్యావరణంపై ఇంట్రెస్ట్ తో పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నా. 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం, వారికి ప్రశంసా పత్రాలు అందించడం చాలా గ్రేట్.
నగరాలు, పట్టాణాల్లోకే కాదు… గ్రామాల్లోకి కూడా పాల ప్యాకెట్లు, పాల పౌడర్ డబ్బాలు, ప్యాకేజ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ (పాల ఉత్పత్తులు) వచ్చేసినయ్. నూటికి 90 శాతం మంది వాటిపైనే ఆధారపడి జీవించే పరిస్థితిలోకి వచ్చేసినం. లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తినే తిండి, తాగే నీళ్ల వరకు అన్నీ కలుషితం అయిపోయినయ్. కడుపులో పిండాన్ని కూడా మనం తినే తిండితో కలుషితం చేస్తున్నం. బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది మొదలు జీవితాంతం రకరకాల టీకాలు, ఇంజక్షన్లు, మందులు, టెస్ట్ లతోనే గడిపే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మన భారతీయ సంస్క్రుతి, సనాతన ధర్మం, మన జీవన విధానాన్ని మర్చిపోయి… విదేశీ సంస్క్రుతికి, జీవన విధానానికి అలవాటు పడటమే ప్రధాన కారణం. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే… మన భవిష్యత్ తరాల మనుగడే ప్రమాదంలోకి వెళ్లే అవకాశముంది. ఈ పద్దతి మారాలంటే… భారతీయ మూలాలపై నేటి తరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైంది. అందుకోసం పాటుపడుతున్న గోసేవా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నా.
తల్లి తరువాత అంతటి గొప్ప స్థానం ఆవుకు ఇస్తాం. అందుకే గోమాత అని పిలుచుకుంటాం. మన పండించే పంటలకు, తిండికి, శక్తికి గోమాత ప్రధాన కేంద్ర బిందువు. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రక్రుతి సమతుల్యతను కాపాడే జీవి ఏదైనా ఉందంటే అది గోమాత మాత్రమే. ఎందుకంటే గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యిసహా గోవు నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి పర్యావరణానికి అత్యంత అనుకూలమైనదే.
గోమయం (పేడ) పొలాలకు ఎరువుగా పనిచేస్తుంది. నేల సారాన్ని పెంచుతుంది. బయో గ్యాస్ తయారీకి ఉపయోగపడుతుంది. పిడకలు కాల్చినప్పుడు వాయు కాలుష్యం తగ్గుతుంది. పేడతో ఇళ్లు పూయడం వలన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. గోమూత్రం (Cow urine) అనేక వైరస్‌లను చంపే గుణాలు కలిగి ఉంది. గోమూత్రాన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్ (సేంద్రీయ పీడకనాశిని) వాడతాం. గోమూత్రం + గోమయం కలిపి జీవామృతం తయారు చేసి యూరియా, డీఏపీల అవసరం లేకుండా పంటలను పండించవచ్చు. అన్నింటికీ మించి భూసారం పెరగడమే కాకుండా రసాయన కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “గోమాతను కాపాడితే ప్రకృతిని కాపాడినట్లే. ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్టే. ఇంకా చెప్పాలంటే మన సంస్కృతి, మన భవిష్యత్తు, మన భూమాత మనుగడు … ఈ గోమాతలోనే దాగి ఉన్నాయి. గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
గోవు అంటే మనకు పాలు ఇచ్చే జంతువు మాత్రమే కాదు… ఆమె మనకు ప్రాణం ఇచ్చే జీవం. ఎందుకంటే గోవు మనకు పాలు ఇస్తుంది… గోమయం నేలకు జీవం ఇస్తుంది… గోమూత్రం పంటలకు రక్షణ ఇస్తుంది… ఇలా గోవు జీవన చక్రంలో ప్రతి అణువూ పర్యావరణ మిత్రం. ఇవి కేవలం మతపరమైన విశ్వాసాలు కావు. సైన్స్ ( శాస్త్రం) అంగీకరించిన నిజాలు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా “కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్” వైపు అడుగులు వేస్తున్నాయి. ఈరోజు విదేశాలు ఆసక్తి చూపుతున్న ఈ “కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్” శతాబ్దాల క్రితమే మన భారతదేశం ఆచరించి అద్బుత ఫలాలను అందించింది. అసలు గోవు మత సంబంధమైన అంశం కానే కాదు… అన్ని మతాలకు తల్లి లాంటిది గోమాత. ఇస్లాంలో మత పెద్దలు కొందరు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసుకునే సందర్భాలు కోకొల్లలు.
అందుకే మనకు గోశాల అంటే జంతువుల ఆశ్రయం కాదు… పర్యావరణ పాఠశాల!. మన తల్లి మన కోసం మాత్రమే పాలను ఇస్తుంది. కానీ గోమాత సమస్త మానవ జాతి మనుగడ కోసం పాలు ఇస్తుంది. భూమాతను కాపాడుతుంది. గోవు నడియాడిన నేల సారంగా ఉంటుంది. గాలి స్వచ్ఛంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్టే,.. ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్టే. అందుకే గోమాతను కాపాడడం — మన అందరి పవిత్ర బాధ్యత!
బాధాకరమైన విషయం ఏందంటే… గోమాత సంరక్షణ అనే మాటే కరువైంది. కొంత మంది మనసులో ఉన్నా అక్కడే ఆగిపోయింది. ఆచరణలో మాత్రం లేనేలేదు. అందుకే ఇయాళ పర్యావరణం కలుషితమైంది. నిత్యం ప్రక్రుతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. గోవులను సంరక్షించడమే మర్చిపోయినం. అందుకే గోవులు రోడ్ల మీద తిరుగుతూ చెత్తకుప్పల్లో ఆహారం వెతుకుతున్నాయి. ఒకప్పుడు మన పూర్వీకులు గోమాతను పూజిస్తే, ఇయాళ మనం గోమాతను చెత్త, ప్లాస్టిక్ వస్తువులు తినే జంతువుగా మార్చేశాం.
ప్రభుత్వాలు గోమాత పేరుతో పథకాలు ప్రకటిస్తాయి…కానీ అవి కాగితాలకే పరిమితమైనయ్. కొందరైతే గోమాత సంరక్షణను కేవలం మతపరమైన అంశంగా చూస్తున్నారు. గోవును కోల్పోతే ఏమవుతుందో కూడా ఆలోచించడం లేదు. గోవు లేకపోవడం వల్లే రైతులు రసాయన ఎరువులకు బానిసలయ్యారు. గోమయం, గోమూత్రం లేక నేల బలహీనమై పంటలు విషతుల్యమై చివరకు మనం తినే తిండి కెమికల్స్ తో నిండి పోయిందనే విషయాన్ని మర్చిపోతున్నం. సమస్త రోగాలకు మనం తినే తిండే కారణమని విస్మరిస్తున్నం. పాలిచ్చే అమ్మను విస్మరించి రోడ్డున పడేయడం ఎంత పాపమే… భూమాతను, సమస్త ప్రక్రుతిని కాపాడే గోమాతను విస్మరించి రోడ్డు పాల్జేయడం అంతకంటే ఘోరం.
రైతన్నలు ఎప్పుడైతే పురుగు మందులు కొడతారో, అవి తిన్న మనం రోగాలు ఎక్కువైపోయి హాస్పిటల్ పాలు అవుతున్నాము. కొంతమంది దుర్మార్గులు ఆవుల జాతి మొత్తం అంతరించిపోయేటట్టు చేశారు. దీన్ని ఆపాలని మా ప్రభుత్వం , వీటి మీద అవేర్నెస్ పెంచి ఆవు యొక్క గొప్పతనం ఏంటి ?ఆవు లేకపోతే ఎందుకు వ్యవసాయం కుంటుపడుతది ,ఆవు లేకపోతే వ్యవసాయంలో రైతన్నకు పెట్టుబడి ఎక్కువైపోయి ,తను అప్పుల పాలై తను కష్టాలు పాలవుతున్నాడు, వీటిని ఆపడానికి మోదీగారి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.1)రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2) నేషనల్ మిషన్ అన్ నేచురల్ ఫామింగ్( NMNF), 3) లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ , 4 నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్
5) నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లాంటి పథకాల వల్ల గోవుల యొక్క సంతతి పెరిగేటట్లుగా చేస్తున్నాం. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులపై సున్నా శాతం జీఎస్టీ విధించాం.
మనం, మన పిల్లలు బాగుండాలంటే గోవులను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 42 లక్షల పశు సంపద మాత్రమే ఉంది. అందులో సగం పాలు ఇవ్వనివే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇవి ఇచ్చే పాలు ఒక్క హైదరాబాద్ నగరానికే సరిపోవు. అందుకే ప్యాకెట్ పాలు, పౌడర్ డబ్బాలపై ఆధారపడుతున్నాం. ఈ పద్దతి మారాలి. ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి పాఠశాలలో పిల్లలకు గోమాత విలువ నేర్పేలా పాఠ్యాంశాలను చేరుస్తాం. ప్రతి రైతు తన నేలకీ గోవుతో బంధం తిరిగి ఏర్పరిచేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణను ప్రోత్సహించాలి.