టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల కూరలు వండుకుని తినడానికే ఈ సమావేశాన్ని వాడుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తాము చెప్పగలమని.. కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పలేకే ప్లీనరీలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
2014లో మోదీ ప్రధానిగా అధికారాన్ని చేపట్టే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండేదని.. ఈ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలను కేంద్రం చేపట్టిందని బండి సంజయ్ వివరించారు. విదేశీ నేతలు కూడా పలు సందర్భాల్లో మోదీ పనితీరును మెచ్చుకున్నారని.. కానీ కేసీఆర్‌కు మాత్రం మోదీ చేసిన పనులు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.. అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. రూ.70వేల కోట్లు డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడిందన్నారు. అందుకే విద్యుత్ ఛార్జీలను ఇటీవల ప్రభుత్వం పెంచిన సంగతిని బండి సంజయ్ గుర్తుచేశారు.
మరోవైపు రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు అంచనాలు పెంచి దోచుకోలేదా అని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం ఆస్తులు గణనీయంగా పెరిగాయి కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ ఆయన కుటుంబం ఆస్తులను ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఎన్టీఆర్ తన అభిమాన నాయకుడు అని పొగిడిన కేసీఆర్.. ఆనాడు వైశ్రాయ్ హోటల్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఆయన లేరా అంటూ బండి సంజయ్ సూటి ప్రశ్న వేశారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేస్తుంటే ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అభినందన తీర్మానం ఎలా పెట్టుకుంటారన్నారు. ప్రశాంత్ కిషోర్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ కాదని.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.