తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ… కేటీఆర్.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్దపడు అంటూ సవాల్ విసిరారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే… ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయ్..’’ అని సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ శుక్రవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం సమీపంలోని హెచ్ఎండీ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
మీ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ పాపం ఒట్టిగ పోతదా? పేద విద్యార్థులు చనిపోతే మీ అయ్య కనీసం స్పందించని మూర్ఖుడు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీఛార్జ్ చేయించిన దుర్మార్గపు కుటుంబం మీది అంటూ ధ్వజమెత్తారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజల తరపున పోరాడుతున్నా.. వాస్తవాలే మాట్లాడుతున్నా.. నువ్వు ఐక్య రాజ్యసమితి పోయి నోటీస్ ఇచ్చుకో…నామీద దావా వేసే ముందు గ్లోబరీనా సంస్థకే ఆయనకున్న సంబంధమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఉద్యోగాలివ్వకపోవడంవల్ల వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వాళ్ల చావులకు నువ్వు, నీ అయ్యనే కారణం. ఇయ్యి లీగల్ నోటీస్ అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండె ఆగిన కార్మికుల చావులకు నీ అయ్యనే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్… 317 జీవోతో ఇంటికొకరు పుట్టకొకరు అయి చాలామంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరు.. ఇయ్యి లీగల్ నోటీస్. వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో వరి కల్లాల మీద తనువు చాలించిన రైతుల చావులకు నీ అయ్యే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్.. అంటూ మండిపడ్డారు.
అసలు మీ మీద 420 కేసు పెట్టాలి. దళితుడిని సీఎం చేస్తానన్నవ్. దళితులకు మూడెకరాలు ఇస్తానన్నవ్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నవ్. నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నవ్. రైతులకు రుణమాఫీ అన్నవ్. ఇంటికో ఉద్యోగమిస్తానన్నవ్. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీలిచ్చి మోసం చేశావ్. మీ మీద 420 కేసు పెట్టాలని విమర్శించారు. నీకు గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయ్.. నీ సంగతి అంతా తెలుసు. మీకు, యూఏఈలో ఉన్న బీఆర్ శెట్టితో ఉన్న సంబంధమేంటో అన్నీ తెలుసు. ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నం. మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రేపు మీటింగ్ కు లక్షలాది మంది వస్తుండటంతో గజ గజ వణుకుతున్నడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఏం చేయాలో తెల్వక లీగల్ నోటీసులతో డ్రామాలాడుతున్నరు. నేను ఇప్పటికే చాలాసార్లు ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయిన. నాకేం కొత్త కాదు… నువ్వెన్ని లీగల్ నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదు. నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే… ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయ్.. ’’అని సవాల్ విసిరారు.