యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10న ఎదుర్కోలు, 11న కల్యాణం, 12న రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం కలిగించే ఉద్ఘాటన కార్యక్రమం నిమిత్తం ఈ నెల 28న సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్యర్వంలో ప్రధానాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, 28వ తేదీకి ముందు కూడా ఒకరోజు సీఎం యాదాద్రిని సందర్శించి పనులు పరిశీలిస్తారని తెలిసింది. ఆ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మరో యాగం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ అర్చకులతో అధికారులు చర్చిస్తున్నారు.