యువత మేలుకో దేశాన్ని ఏలుకో అన్న సూక్తిని నిజం చేస్తున్నాడు ఆగ్రామ సర్పంచ్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు..అనే మంచి మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఆగ్రామ ప్రథమ పౌరుడు. అభివృద్ధి నూతన పంథాలో సాగాలంటే నేటి యువత రాజకీయాల్లోకి రావాలి అనే మాటకు వాస్తవ రూపంగా నిలిచాడు. గ్రామంలో సౌరవెలుగులు నింపుతూ గ్రామానికే దిక్సూచిగా, పలువురికి మార్గదర్శిగా మారాడు అంకోల్ క్యాంప్ సర్పంచ్ .
అంకోల్ క్యాంప్ సర్పంచ్ క్యాంప్ ను అభివృద్ధి లోనే కాకుండా సౌర విద్యుత్ లో వెలుగులు నింపుతున్నాడు. కరెంట్ బిల్లుల భారం తగ్గించడమే కాదు, అక్కడ ఉన్న ప్రజలకు లాభం చేస్తున్నాడు ఆ గ్రామ ప్రథమ పౌరుడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ పనితీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బాన్సువాడ – నిజామబాద్ ప్రధాన రోడ్డు ప్రక్కనే ఉన్న క్యాంప్ లో ఇప్పుడు మొత్తం సోలార్ వెలుగులు నింపుతున్నాడు. తన గ్రామాన్ని మొత్తం సౌరవెలుగులతో నింపేసి సరికొత్త వెలుగుల ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. వినియోగదారులకు కరెంట్ బిల్లులు లేకుండా, అధిక బిల్లులతో జేబులకు చిల్లులు లేకుండా చేయడంతో పాటు… మిగిలిన కరెంట్ ను విద్యుత్ సంస్థకు అమ్ముకునే వీలు కల్పించాడు సర్పంచ్ వెంకట్ రమణ. ఇక్కడ వంద కుటుంబాలు నివాసముంటుండగా ఇప్పటికే 14 కుటుంబాలు పూర్తిగా సౌరవిద్యుత్ నే వినియోగిస్తున్నాయి.
14 కుటుంబాలకు తోడు ఇప్పుడు మిగిలిన కుటుంబాలు సైతం సౌర విద్యుత్ కు సై అంటూ కొత్త అప్లికేషన్ లు పెట్టుకున్నాయి. వీరిలో 11 కుటుంబాలు 3 KV, మిగిలిన మూడు ఇళ్లపై 2 KV విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక KV సౌరవిద్యుత్ ప్లాంటుకు 60 వేల రూపాయలు ఖర్చవుతుండగా 3 KV ప్లాంట్ కు 1 లక్షా 80 వేలు ఖర్చవుతుంది. అయితే వీటికి రెడ్ కో ద్వారా 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. 50శాతం స్త్రీ నిధి ద్వారా బ్యాంక్ లోన్ ఇస్తుంది. మిగిలిన 10శాతాన్ని మాత్రమే లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. ముందుగా ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు అంకోల్ సర్పంచ్ రమణ.
స్పీకర్ పోచారం అధికారులతో మాట్లాడి స్త్రీనిధి ద్వారా సొమ్మును రుణాల రూపంలో ఇప్పించే ఏర్పాటు చేశారు. లబ్దిదారు స్త్రీనిధి ద్వారా పొందిన రుణాల్ని ఐదేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్లకు టాటా కంపెనీ వారు 25 ఏళ్ల వరకూ వారెంటీ ఇస్తారు. బ్యాంక్ ఇచ్చిన రుణం 5 ఏళ్లలో పూర్తవుతుంది. మిగతా 20 సంవత్సరాలు ఫ్రీగా కరెంట్ వాడుతూ మిగతా కరెంట్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అంటున్నారు సర్పంచ్ వెంకట్ రమణ. సర్పంచ్ వెంకట్ రమణను మొదటగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించగా.. సక్సెస్ సాధించడంతో కామారెడ్డి కలెక్టర్ జితేష్. వి. పాటిల్ మరింత ప్రోత్సాహాన్ని అందించారు. తమగ్రామంలో వెలుగులు నింపి… విద్యుత్ బిల్లులతో జేబుకు చిల్లులు పడకుండా చేసిన గ్రామ సర్పంచ్ ను పంచాయితీ ప్రజలు అభినందిస్తున్నారు.