తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 45 ఏళ్ల కిందట వివాహమైన ముగ్గురు వృద్ధులకు కళ్యాణలక్ష్మీ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కళ్యాణలక్ష్మీ ఆర్థిక సాయం పడింది. ఇచ్చోడ మండలం చించోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల గంగుబాయి అనే మహిళకు రెండుసార్లు డబ్బులు జమ అయ్యాయి. ఆమె భర్త పదేళ్ల క్రితమే మరణించినా గంగుబాయి ఖాతాలో డబ్బులు జమ కావడం చోద్యంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Also: మహిళకు మధ్యవేలు చూపించినందుకు ఆరునెలల జైలుశిక్ష
అయితే ఆయా ఘటనలు సాంకేతిక పొరపాటు కారణంగా జరిగినవి కాదని… అక్రమంగా నిధులను దారి మళ్లించడానికే అధికారులు ఇలా కళ్యాణలక్ష్మీ డబ్బులను వేరొకరి ఖాతాలకు మళ్లిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు కావాలనే నకిలీ లబ్ధిదారుల పేరుతో దరఖాస్తులు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కళ్యాణ లక్ష్మీ ఆర్థిక సహాయం అందాలంటే అధికారులు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.