PhonePe Republic Day Scam Alert: సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో “PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్”, “సంక్రాంతి కానుక” అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారు. “మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి!” అంటూ ఒక లింక్‌ను షేర్ చేస్తున్నారు. ఇది అమాయకులను బుట్టలో వేయడానికి నేరగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. మీకు తెలిసిన వారి నుంచి లేదా గ్రూపుల నుంచి ఇలాంటి సందేశాలు వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ మెసేజ్ చివరన ఉండే లింకులను గమనించండి. అవి fdgc.lusvv.xyz లేదా iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలతో ఉంటాయి. ఇవి అధికారిక PhonePe లింకులు కావని గ్రహించండి.
READ MORE: బోల్డ్ లుక్స్.. శక్తివంతమైన ఇంజిన్! ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త MG Majestor..
ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్‌వర్డ్‌లు తస్కరించి.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. PhonePe, Google Pay లేదా మరే ఇతర సంస్థ అయినా ఇలా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు వెల్లడించారు.
READ MORE: OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!