సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది. తాజాగా ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విషయంలో కూడా అదే జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని,గతంలో ధనుష్ హాజరైన కొన్ని బాలీవుడ్ పార్టీల్లో మృణాల్ కనిపించడం, అలాగే ఆమె ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ధనుష్ రావడం వంటి సంఘటనలు ఈ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఇప్పుడు ఏకంగా వచ్చే ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే రోజే రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ పెళ్లి వార్తలపై మృణాల్ ఠాకూర్ టీమ్ స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చింది.
Also Read : Mana Shankara Vara Prasad Garu: ‘శంకర వరప్రసాద్’ థియేటర్ల సందడి.. ఏ ఏ ఊర్లకు వెళ్తున్నారంటే?
‘వచ్చే నెలలో మృణాల్ వివాహం చేసుకుంటుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది’ అని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఫిబ్రవరి 20న మృణాల్ నటించిన బాలీవుడ్ సినిమా ‘దో దీవానే సెహెర్ మే’ విడుదల కానుంది. ఆ వెంటనే మార్చిలో అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) షూటింగ్ పనుల్లో ఆమె బిజీగా ఉండబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య పెళ్లి ప్రసక్తే లేదని, ఇవన్నీ కేవలం ఆధారం లేని రూమర్లేనని టీమ్ తేల్చి చెప్పింది. దీంతో గత కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ క్రేజీ గాసిప్‌కు తెరపడినట్లైంది.