అమ్మ.. దేవుడు అన్నిచోట్ల వుండలేక అమ్మలో తానుంటాడంటారు. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి రుణం తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. అమ్మ గుర్తుగా కొడుకు వినూత్న ప్రయత్నం చేశాడు. అమ్మకు ఇష్టమైన మామిడి చెట్టును అంత్యక్రియలు నిర్వహించిన చోటే నాటి తన ప్రేమను చాటుకున్నాడు పుత్ర రత్నం.
హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న కిరణ్ కుమార్ అమ్మకు ప్రేమతో చెట్టుని నాటాడు. గతేడాది కరోనా బారిన పడి మృతి చెందిన అమ్మ రాధకు గుర్తుగా ఏదో చేయాలని భావించాడు. 25 ఏళ్ల కింద మామిడి మొక్కను నాటారు కిరణ్ అమ్మ రాధ. తన తల్లికి ఎంతో ఇష్టమైన మామిడి చెట్టును శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలు కత్తిరించి మెషిన్ సాయంతో వెలికితీశాడు కిరణ్. ట్రాన్స్ లోకేషన్ పద్ధతిలో మామిడిచెట్టుకి తిరిగి జీవం పోశాడు.
అమ్మ రాధ. కొడుకు కిరణ్
తల్లి రాధకు అంత్యక్రియలు నిర్వహించిన చోట గుంత తవ్వించి అందులో మామిడి చెట్టు నాటించాడు తనయుడు. అమ్మకు ఇష్టమైన చెట్టును ఆమె అంత్యక్రియలు నిర్వహించిన చోటే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు కిరణ్ కుమార్. మామిడి చెట్టుని రీలోకేషన్ ద్వారా నాటారు. మామిడిచెట్టుని కంటికిరెప్పలా కాపాడతానని కిరణ్ కుమార్ చెబుతున్నారు. తల్లికి గుర్తుగా మామిడి చెట్టుని నాటిన కిరణ్ కుమార్ ని అంతా అభినందిస్తున్నారు.
మామిడి చెట్టు కాయలు కాస్తే తల్లి ఇచ్చిన గుర్తుగా అందరికీ పంచుతానంటున్నారు. కిరణ్ కుమార్ లాంటి కొడుకు అందరికీ వుండాలని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు మళ్ళిన తల్లిదండ్రులు తమకు భారమని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో తల్లి గురుతుల్ని పదిలంగా నిలుపుకుంటున్న కిరణ్ కుమార్ అభినందనీయుడు కదా.
Tomato Price: మరింత పెరిగిన టమోటా.. కిలో 70